Thursday, 20 October 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 63

   శ్రేయస్సు ఎచ్చటా లేదు. అది తనలోనే ఉంది. విషయాలను కోరకుండా, ‘పరమాత్మయే నాకు కావాలి’ అనే పట్టుదలతో, వైరాగ్యంతో భక్తులను సేవిస్తూ, చిత్తశుద్ధిని పొంది, భగవంతునివైపు తిరిగినవారికి ‘సచ్చిదానందమైన బ్రహ్మము అంతటా ఉందనీ, అదే తన ఆత్మ’ అని నిస్సంశయంగా బోధపడును. ఇదే ఉపనిషత్తుల ప్రధానమైన ఉపదేశం.

స్వామీ సచ్చిదానంద బోధలు - 62



        శరీరం ఒక కోట గోడ ఉన్నట్లు, ఇంద్రియాలు అందలి కీలకస్థానాలు. కోటకట్టడం ఎక్కడెక్కడ సడలి ఉంటుందో అక్కడక్కడ శత్రువులు ఆ కోటను భేదించడానికి ప్రయత్నిస్తారు. శరీరం, ఆరోగ్యం, కాంతి. బలం, శుచి- ఇదంతా ఇంద్రియాల ఆరోగ్యం. కాంతి, బలం మున్నగునవి శుచిని అవలంబించి ఉంటాయి. కాన శరీరాన్ని బయట శుచిగా ఉండులాగున చేసుకొంటే చాలదు. వివేకి ఇంద్రియాలను శుచిగా ఉంచుకోవడానికి కృషి చేయటం ముఖ్యం. దీనవల్ల శరీరమనే కోటపై కామాది శత్రువుల దాడి ఉండదు.

Wednesday, 19 October 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 61



  అన్ని దానాల్లో బ్రహ్మదానం గొప్పదని శ్రుతిస్మృతులు చాటుతున్నాయి. శ్రీశంకర భగవత్పాదులవారు ఇట్టి బ్రహ్మదానం చేసిన మహామహులు. బ్రహ్మదానం అంటే బ్రహ్మవిద్యాదానం. బ్రహ్మవిద్యాదానంలో అన్ని దానాలు అంతర్గతం. శ్రీసద్గురువుల ద్వారా ఆత్మవిద్యను పొంది, శ్రీశంకరులకు ఇష్టమైన బ్రహ్మదానం ఆచరించడం కన్నా గొప్ప ఉపకారం వేరే లేదు. ఇదే శ్రీశంకరజయంతి ఉద్దేశం.