Wednesday, 30 November 2016

స్వామీ సచ్చిదానంద బోధలు - 82



 రాగం, ద్వేషం మున్నగునవి మానవులను పీడిస్తున్నాయి. ఇదే సంసారబంధం. ఒకసారి ఒక సాధువును ‘వైకుంఠానికి ఎవరు పోతారు?’ అని ఎవరో అడిగినందుకు, ఆ సాధువు ‘నేను పోతే పోతాను’ అన్నాడట. ఆ సాధువుకు ఎంత అహంకారం ఉందని కొందరనుకున్నారు. కాని ఆ మాట విన్న జిజ్ఞాసువులు ‘నేను’ అనే మాటకు అహంకారం అని గ్రహించాలి. ‘నేను పోతే – అంటే అహంకారం పోతే పోతాము’ అని గ్రహించారట.

స్వామీ సచ్చిదానంద బోధలు - 81



   గాఢనిద్రలో ‘నేను’ అనే జీవుడు తోచడు. ‘నేను’ ఇప్పుడు మాత్రమే తోస్తున్నందున జీవుడు మిథ్య. కాబట్టి అహంకారానికి సాధకుడు విలువను ఇవ్వరాదు. గాఢనిద్రలో నీవు, వారు, అది అనే ద్వైతం లేదు. కావుననే అచట రాగద్వేషాల గందరగోళం లేదు. అపుడు అందరం పరమాత్మలో లీనమై ఉంటాము. ఉదయం అతని నుండే బయటకు వస్తున్నాం మిథ్యారూపమైన ‘నేను’కు విలువను ఇవ్వక అంతా పరమాత్మ నుండి ఏర్పడినది కాబట్టి అంతా పరమాత్మయే అనే భావనను సాధకుడు వృద్ధి చేసుకోవటం శ్రేయస్కరం.

స్వామీ సచ్చిదానంద బోధలు - 80



 శ్రీశంకరులు శరీరాభిమానాన్ని పోగొట్టే వేదాంతాన్ని బోధించడంవలన వారు తమ భౌతికశరీరానికి సంబంధించిన వివరాలను ఎచ్చటనూ చెప్పలేదు. ఇది వారి యోగ్యతకు అనుగుణంగానే ఉంది. అయినా వారి చిత్రపటానికీ, విగ్రహానికీ పూజ పునస్కారాదులని ఆచరించడం వలన వారి భావనలు మనపై తమ ప్రభావాన్ని చూపుతాయి. ఈ దృష్టిచేతనే వారి జయంతినీ ఆరాధనలనూ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం.